సైన్యంలో పనిచేస్తూ గతేడాది ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్, పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన 26వ బెటాలియన్ కెప్టెన్ అంశుమన్ సింగ్‌కు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారంతో కేంద్రం సత్కరించింది. ఈ అవార్డును కెప్టెన్ అంశుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్, అతని తల్లి అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకునే సమయంలో.. కెప్టెన్ అంశుమన్ సింగ్ ధైర్య సాహసాల గురించి చెబుతుండగా.. స్మృతి సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే అవార్డు స్వీకరించిన తర్వాత.. వారి ప్రేమ గురించి ఆమె వెల్లడించారు.
కాలేజీలో చదువుతున్నపుడు తాము ఇద్దరం మొదట కలిసినట్లు స్మృతి సింగ్ తెలిపారు. పరిచయం కాస్తా ప్రేమగా మారిందని చెప్పారు. ఆ తర్వాత ఆర్మీ మెడికల్ కాలేజీకి అంశుమన్ సింగ్ ఎంపికైనట్లు స్మృతి సింగ్ పేర్కొన్నారు. అనంతరం 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్నట్లు వెల్లడించారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని.. దీంతో 2023 ఫిబ్రవరిలో తమ వివాహం జరిగినట్లు తెలిపారు. అయితే పెళ్లి అయిన 2 నెలలకే అంశుమన్ సింగ్‌కు సియాచిన్‌లో పోస్టింగ్ ఇచ్చారని వివరించారు.
చివరిసారిగా తాము ఇద్దరం 2023 జులై 18 వ తేదీన చాలాసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు స్మృతి సింగ్ తెలిపారు. సొంత ఇల్లు, పిల్లలు, భవిష్యత్.. రాబోయే 50 ఏళ్ల తమ జీవితాన్ని అందంగా ఉంచుకోవాలని ఎన్నో కలలు కన్నామని చెప్పారు. అయితే ఆ తర్వాతి రోజే జులై 19 వ తేదీన జరిగిన ప్రమాదంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడైనట్లు తెలిసిందని ఆమె వెల్లడించారు. అయితే ఇది జరిగి ఏడాది పూర్తవుతున్నప్పటికీ.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాని చెప్పారు. ప్రస్తుతం కెప్టెన్ అంశుమన్ సింగ్ కీర్తి చక్ర అవార్డు తన చేతిలో ఉందని.. ఇక అతడు రాడు అనేది నిజమేనేమో అని పేర్కొన్నారు. తన భర్త ఓ హీరో అని.. ఆయన తమను వదిలి వెళ్లిపోయినా ఎన్నో కుటుంబాలను రక్షించారని స్మృతి సింగ్ వెల్లడించారు.
పంజాబ్ రెజిమెంట్ 26వ బెటాలియన్‌కు చెందిన కెప్టెన్ అంశుమన్ సింగ్.. ఆర్మీ మెడికల్ కార్ప్స్ డాక్టర్‌గా సేవలు అందించారు. గతేడాది జులై 19 వ తేదీన సియాచి బేస్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న జవాన్లను కెప్టెన్ అంశుమన్ సింగ్ కాపాడి బయటకు తీసుకువచ్చారు. అయితే మెడికల్ ఇన్విస్టిగేషన్ రూమ్‌కు మంటలు వ్యాపిస్తుండగా వాటిని అదుపుచేసే క్రమంలో అవి అతనికి అంటుకున్నాయి దీంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ కెప్టెన్ అంశుమన్ సింగ్ అమరుడయ్యారు. దీంతో ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర ప్రకటించింది.