2024-07-04 22:50:01
Alluri Sitaramaraju Follower Mallu Dora : స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎనలేనిది. బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు దేశానికి స్వాతంత్రం కల్పించేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. స్వాతంత్ర సమపార్జన కోసం అల్లూరు సీతారామరాజు చేపట్టిన విప్లవంలో పాల్గొన్న ఎంతోమంది వీరులను బ్రిటిష్ ప్రభుత్వం హతమార్చిందని చెబుతుంటారు. వీరిలో ఒక్కరిని కూడా బ్రిటిష్ సైన్యం ప్రాణాలతో విడిచిపెట్టలేదన్నది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. కానీ, అల్లూరి సీతారామరాజుకు కుడి భుజంగా పని చేసిన ఒక అనుచరుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావు నుండి బయటపడి దేశ స్వాతంత్ర సమపార్జన అనంతరం ప్రజలు పీల్చిన స్వేచ్ఛ వాయువులను కూడా చూశారు. ఆయనే గాం మల్లు దొర. అల్లూరు సైన్యంలో ఎంతో పేరు పొందిన గాం సోదరుల్లో ఒకరే మల్లు దొర. దేశానికి స్వాతంత్ర అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అల్లూరి అనుచరుల్లో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిగా నిలిచిన గాం మల్లు దొర.. ఆ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడం గమనార్హం. అయితే ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే ఇప్పటికీ తెలుసు. స్వాతంత్ర భారతాన్ని చూసిన ఏకైక మన్యం విప్లవ వీరుడుగా ఈయన నిలిచారు. నేడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి నేపథ్యంలో ఆయన అనుచరుడు గురించి అందిస్తున్న ప్రత్యేక స్టోరీ.
అల్లూరు విప్లవానికి కారణం గాం సోదరులే..
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రారంభమైన విప్లవాన్ని ముందుండి నడిపించింది అల్లూరి సీతారామరాజు. అయితే, ఈ విప్లవానికి కారణం మాత్రం గాం సోదరులుగానే చెబుతారు. గాం సోదరులుగా పేరుపొందిన గంటం దొర, మల్లు దొర విశాఖ మన్యంలోని చింతపల్లి తాలూకా బట్టపనుకులు అనే పల్లెలో పుట్టారు. వీరు అల్లూరు సీతారామరాజు కంటే వయసులో కొద్దిగా చిన్నవారు. కాలక్రమేనా గ్రామ మనసబుగా ఎదిగాడు గంటం దొర. గిరిజనుల్లో తనకు మంచి పేరు ఉండేది. ఆయనది కాస్త శాంత స్వభావం. అయితే, తమ్ముడు మల్లు దొరది దూకుడు తత్వం. అదే సమయంలో భాష్టియన్ అనే అధికారి చింతపల్లి తహసీల్దార్ గా పని చేసేవాడు. అతను, అతని అనుచరులు మన్యం గిరిజనులకు అన్ని విధాల దోచుకుంటూ ఉండేవారు. పై అధికారులు చెప్పినవి, చెప్పనవి టాక్సులు కూడా గిరిజనుల నుండి ముక్కు పిండి వసూలు చేసేవాడు. అప్పట్లో నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుండేది. ఆ సమయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కూలీలుగా వచ్చిన గిరిజనులకు ఇచ్చే కూలీ డబ్బుల్లో వాటా కొట్టేసేవాడు. అప్పటికే ఒకపక్క బ్రిటీష్ ఆంక్షలు వల్ల తమ సాంప్రదాయ సేద్యానికి, ఇతర అటవీ జీవన విధానానికి దూరం అవుతున్న గిరిజనులకు బాష్టియన్ గ్యాంగ్ ఆగడాలు కడుపున రగిలించాయి. వీటిపై ఎదురు తిరిగినందుకు గంటం దొరను.. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నాడు అంటూ ఫిర్యాదు చేసి మునసబు పదవి నుండి తొలగించేలా చేశాడు బాష్టియన్. అంతేకాకుండా వారి భూములను కూడా ప్రభుత్వ పరం చేయించాడు. దీంతో బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగారు గాం సోదరులు. వీరి తిరుగుబాటు నుంచే గిరిజన విప్లవం మొదలైందని చెప్పవచ్చు.
అల్లూరికి ప్రధాన అనుచరులుగా మారిన గాం సోదరులు..
అప్పటికే మన్యం ప్రాంతంలో తిరుగుతూ గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అల్లూరు సీతారామరాజును కలిసిన గంటం దొర, మల్లు దొరలు ఆయనతో చేతులు కలిపారు. విప్లవంతోనే బ్రిటీష్ వారి చేతుల నుండి అటవీ ప్రాంతాన్ని స్వేచ్ఛ పొందేలా చేయగలమని భావించి మన్యం విప్లవానికి తెరలేపారు. మహా రుద్రాభిషేకం చేసి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు 22న చింతపల్లి నుండి రెండేళ్లపాటు బ్రిటిష్ అధికారులను హడలెత్తించారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో అల్లూరి సీతారామరాజు విప్లవం మొదలైంది. ఆ తరువాత రాజు, ఆయన అనుచరులు కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. ఈ పోరాటాల్లో ఎప్పుడూ 150 నుండి 200 మంది వరకు సీతారామరాజు వెంట సైన్యం గా ఉండేవారు అని చరిత్రకారులు చెబుతారు. వీరిలో గాం సోదరులు ప్రధాన అనుచరులు కాగా, వీరయ్య దొర, అగ్గిరాజు, ఎండు పడాలు, మోదిగాడు, ఎర్రేను సంకోజీలు ముఖ్యులుగా చెబుతారు.
బ్రిటిష్ సైనికులకు మల్లు దొరను పట్టించిన దురలవాట్లు
పోరాటాల్లో దూకుడుగా వ్యవహరించే మల్లు దొరకు ఆయన బలహీనతలు శాపాలుగా మారాయి. మద్యం అలవాటు ఎక్కువగా ఉండటంతో ఒక్కోసారి విప్లవ వీరుల గురించి మత్తులో వాగేసేవాడు. మల్లు దొర అలానే ఒకసారి బ్రిటిష్ గూడచారి ఒకరు మల్లు దొరకు మందు పట్టించి రహస్యాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా అల్లూరి అనుచరులు ఆ గూడచారిని హతమార్చి విషయం అల్లూరి సీతారామరాజుకు తెలపడంతో మల్లు ధరను విప్లవం నుండి బయటకు వెళ్లిపోవాలని శాశించారు. ఇది 1923 సెప్టెంబర్ 17న జరిగింది. అలా మన్యం విప్లవం నుండి బయటకు వచ్చిన మల్లు దొర నడింపాడు అనే ఊర్లో తన ప్రేయసి ఇంట్లో ఉన్నాడు. అప్పటికే ఆమెను తమ వైపు తిప్పుకున్న బ్రిటీష్ వాళ్లు.. ఆమె ఇచ్చిన సమాచారంతో మల్లుదొరను అరెస్టు చేశారు.
ముందు మరణశిక్ష.. ఆ తర్వాత అండమాన్ జైలుకు తరలింపు
ఆ రోజుల్లో బ్రిటిష్ దండనలు చాలా బయంకరంగా ఉండేవి. అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటూ మల్లు దొరను ఎంత హింసించినా తాను మాత్రం విప్లవ వీరుల వివరాలను బ్రిటిష్ వాళ్ళకు చెప్పలేదు. విసుగు వచ్చిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా వాల్తేరు ఏజెన్సీ జడ్జ్ 1924 అక్టోబర్ 23న మల్లు దొరకు మరణ దండన విధించారు. అయితే అది అమలయ్యే లోపు కొంతమంది శ్రేయోభిలాషుల సలహాతో పై కోర్టుకు అప్పీలు చేసుకోవడంతో మరణ దండనను అండమాన్ జైల్లో జీవిత శిక్షగా మార్చి సెల్యులార్ జైలుకు పంపించేశారు ఆంగ్లేయులు. అయితే, ఈ లోపు అంటే 1924 మే 7న అల్లూరి సీతారామరాజును పట్టుకొని కాల్చి చంపారు పోలీసులు. సీతారామరాజు లేకపోయినా సైన్యాన్ని నడిపిన గంటం దొర సరిగ్గా నెలరోజుల తరువాత జూన్ 7న పందుకొంటకొనవాగు వద్ద బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తూ చనిపోయాడు. తన తుపాకీలో తూటాలు అయిపోవడంతో చెట్టు చాటు నుండి ధైర్యంగా బయటికి వచ్చి ఎదురుగా నిలబడ్డ ఆయన్ను కాల్చివేశారు పోలీసులు. మరో నెల గడిచేసరికి రాజు సైన్యంలోని ముఖ్యులు అందరూ చనిపోవడం లేక దొరికిపోవడం జరిగిపోయింది. ఇవన్నీ జరిగిపోయాక శిక్ష పొందిన మల్లు దొర అండమాన్ జైల్లోనే 13న్నర సంవత్సరాలు దుర్భర జీవితం అనుభవించాడు.
స్వాతంత్రానంతరం మన్యం గడ్డపై అడుగుపెట్టిన దొర
13న్నర సంవత్సరాల జైలు శిక్ష తర్వాత విడుదలై వచ్చిన మల్లు దొర నర్సీపట్నం ప్రాంతంలోనే స్థిరపడ్డారు. అక్కడే కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన 1952లో లంక సుందరం గారి ప్రోత్సాహంతో విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి సభలో అడుగుపెట్టారు. తన తొలి ప్రసంగం చేస్తున్న సమయంలో నాటి ప్రధాని నెహ్రూ సహా సభ్యులందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయన అభినందించారు అని పార్లమెంటు ఆర్కైవ్ ల్లో ఉంది. ఒక యాక్షన్ సినిమా కథను తలపించే మల్లు దొర జీవితం 1969 లో ఆయన మృతి చెందడంతో ముగిసింది. ఇప్పటికీ ఆయన వారసులు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. గత ఏడాది అల్లూరి విప్లవం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వారిని సత్కరించింది. అల్లూరి జీవితం ఆధారంగా సూపర్ స్టార్ కృష్ణ 1974లో తీసిన క్లాసిక్ అల్లూరు సీతారామరాజు సినిమాలో గాం మల్లు దొర పాత్రను ప్రముఖు నటుడు ప్రభాకర్ రెడ్డి పోషించారు. ఆ సినిమా విడుదల అయ్యే సరికి అసలైన మల్లు దొర మరణించి కేవలం ఐదేళ్లు మాత్రమే అయింది.
మరిన్ని చూడండి