తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో (2024 జూన్ 2) పదేళ్లు పూర్తి కానుంది. ఈ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీగా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు, ఉద్యమకారులకు ఆహ్వానాలు అందించారు. అయితే అనారోగ్యం కారణంగా సోనియా వేడుకలకు హాజరు కావటం లేదని తెలిసిందే. ఇక తాము ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని కేసీఆర్ నిన్నటే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమాల షెడ్యూల్ ఓసారి చూద్దాం..
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పూర్తి షెడ్యూల్
- నేడు ఉదయం 9.30 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించనున్నారు.
- అనంతరం పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.
- ఆ తర్వాత రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ ను ఆవిష్కరిస్తారు.
- సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. సోనియా గాంధీ వీడియో సందేశం తెరపై చూపించే అవకాశం ఉంది.
- అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రధానం చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులను సన్మానిస్తారు.
- ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 6.30 గంటలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభం అవుతాయి.
- అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు.
- తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే విధంగా కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ కార్నివాల్‌లో 700 మంది కళాకారులు పాల్గొంటారు.
- ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.
- జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్‌పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు.
- ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13.30 నిమిషాల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించనున్నారు.
- అనంతరం జయ జయహే తెలంగాణ గీతం రూపకర్త అందెశ్రీని ఘనంగా సత్కరిస్తారు.
- చివరగా 10 నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాలు ముగుస్తాయి.